|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 07:24 PM
ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన కార్తీక మాసం నేటి నుండి ప్రారంభమైంది. శివుడికి అత్యంత పవిత్రమైన ఈ మాసం మతపరమైన నియమ నిబంధనలు, ఆహారపు అలవాట్లలో మార్పులను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో మాంసాహార వినియోగం తగ్గిపోవడం వల్ల కోడి మాంసం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని కోడి మాంసం వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
కార్తీకంలో తగ్గే కోడి మాంసం ధరలు
శివ భక్తులు, సాధారణ ప్రజలలో చాలా మంది కార్తీక మాసంలో మాంసాహారాన్ని ముట్టకుండా వ్రతాలను నిర్వహించడం అలవాటుగా ఉంది. దీని ఫలితంగా కోడి మాంసానికి ఉన్న గిరాకీ తగ్గిపోతుంది. ప్రస్తుత మార్కెట్లలో ప్రాంతాన్ని బట్టి ఒక కిలో కోడి మాంసం ధర రూ. 210 నుంచి రూ. 250 వరకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ప్రారంభమైనందున.. కోడి మాంసం ధరలు రేపు లేదా రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో తగ్గడం ప్రారంభమవుతుందని వ్యాపారులు తెలియజేశారు.
గిరాకీ తగ్గడం వల్ల కిలో కోడి మాంసం ధర రూ. 170 నుంచి రూ. 180 వరకు తగ్గే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైన వెంటనే ఇలాంటి ధోరణి కనిపిస్తుందని, ఇది సుమారు ఒక నెల పాటు కొనసాగుతుందని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితి వ్యాపారులకు తాత్కాలికంగా నష్టాన్ని కలిగించవచ్చని.. అయితే మాసం ముగిసిన తర్వాత మళ్లీ డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
సాధారణంగా వేసవి కాలంలో, పండుగల సమయంలో కోడి మాంసం ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే.. కార్తీక మాసం వంటి పవిత్ర మాసాలలో భక్తి భావం కారణంగా వినియోగం తగ్గిపోవడం అనేది ఈ వ్యాపారాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. హిందూ సంస్కృతిలో కార్తీక మాసం ఉపవాసాలు, దీపారాధనలు శివారాధనకు ముఖ్యమైనది. అందువల్ల చాలా మంది ఈ మాసంలో మాంసం ముట్టరు. మతపరమైన కట్టుబాట్లే కోడి మాంసం మార్కెట్‌పై తాత్కాలికంగా ప్రభావాన్ని చూపే ప్రధాన కారణంగా వ్యాపారులు భావిస్తున్నారు.