|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 07:15 PM
తెలంగాణలోని విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు.. జెన్‌కో, టాన్స్‌కోలో రానున్న ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌కోకు చెందిన మూడు డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో, జెన్కోలోని.. ఉద్యోగులు ఎలాంటి సమ్మెకు దిగకూడదని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు నవంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ సరఫరా అనేది అత్యవసర సేవ కాబట్టి.. సమ్మెల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మే 10 నుంచి నవంబర్ 9 వరకు పవర్ కార్పొరేషన్లలో సమ్మెలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆరు నెలల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
భారత్‌లో సమ్మె చేసే హక్కు అందరి కార్మికులకు ఉంది. అయితే ఇది ప్రాథమిక హక్కు కాదు. చట్టబద్ధమైన హక్కు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, 1947తో పాటు పలు కార్మిక చట్టాల ప్రకారం.. కొన్ని రంగాల కంపెనీల్లో పరిమితులు, నిబంధనలకు లోబడి సమ్మెలు చేపట్టే హక్కు ఉంది.
సమ్మె చేస్తే ఏమవుతుంది?
ఎప్పుడైనా అత్యవసర వస్తుసేవలు అందించే కంపెనీల్లో.. ఉత్పత్తి, సేవలు నిలిచిపోకుండా ఈ హక్కులపై పరిమితులు విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటేనెన్స్ యాక్ట్ (TESMA), జాతీయ ESMA కొన్ని నిబంధనలు రూపొందించాయి. దాని ప్రకారం.. ఎసెన్షియల్ అని డిక్లేర్ చేసిన వస్తుసేవల కంపెనీల్లో.. సమ్మెలు చేయడంపై ప్రభుత్వం నిషేధం విధించొచ్చు. ఆరు నెలల వరకు ఈ పరిమితులు విధించే అవకాశం ఉంది. ఆదేశాలను అతిక్రమించి ఉద్యోగులు సమ్మెల్లో పాల్గొంటే, సమ్మెలను ప్రారంభిస్తే.. వారిపై జరిమానాలు విధించొచ్చు. వారిని సస్పెండ్ చేయొచ్చు. ఇక అతిక్రమణలు తీవ్రంగా ఉంటే.. జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. సమ్మె చేయడం చట్టబద్ధమైన హక్కు కాబట్టి.. నిషేధం విధించిన సమయంలో అది ఇల్లీగల్ అవుతుంది. మరోవైపు, తెలంగాణ జెన్కో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. విద్యుత్‌ను యూనిట్ రూ.4 చొప్పున డిస్కమ్‌లకు విక్రయిస్తోంది. తెలంగాణ జెన్‌కో అక్టోబర్ 19న అర్ధరాత్రి నాటికి 5000 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రికార్డు స్థాయిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6831 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి జరిగింది. ఆ రికార్డును ప్రస్తుత సంవత్సరంలో జెన్‌కో దాటే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.