|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:03 PM
కరోనా మహమ్మారి మానవాళిపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. అయితే, ఈ వైరస్ ప్రభావం కేవలం సోకిన వ్యక్తికే పరిమితం కాదని, వారి తర్వాతి తరంపైనా పడొచ్చన్న ఒక కొత్త అధ్యయనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గర్భధారణకు ముందు తండ్రికి కొవిడ్-19 సోకితే, పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదల, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ఫ్లోరే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ పరిశోధకులు ఈ సంచలన అధ్యయనాన్ని నిర్వహించారు. వారి పరిశోధన ప్రకారం, కోవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్, తండ్రి శుక్రకణాల్లో అణుస్థాయిలో మార్పులు తీసుకువస్తోందని తేలింది. ఈ మార్పుల కారణంగా, వారికి పుట్టే పిల్లల్లో ఆందోళన సంబంధిత ప్రవర్తనలు ఎక్కువగా కనిపించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.