|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 07:05 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు మరోసారి అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్‌ను బరిలోకి దింపగా.. బీజేపీ తరపున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
అయితే, బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నిక విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రధాన అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ.. ముందస్తు జాగ్రత్త చర్యగా పార్టీ మరో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయించింది. దివంగత సీనియర్ నేత పి. జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమారుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణు వర్థన్ రెడ్డితో కూడా బీఆర్‌ఎస్ తరపున ప్రత్యామ్నాయ నామినేషన్ దాఖలు చేయించింది. ప్రధాన అభ్యర్థి మాగంటి సునీత సమర్పించిన నామినేషన్ పత్రాలలో ఏవైనా సాంకేతిక లేదా చిన్నపాటి తప్పులు ఉండి, ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైతే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా విష్ణు వర్థన్ రెడ్డి ఆ స్థానంలో పోటీలో నిలబడే అవకాశం ఉంటుంది.
ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ సక్రమంగా ఉండి ఎన్నికల సంఘం ఆమోదిస్తే, నామినేషన్ల ఉపసంహరణ తేదీలోపు విష్ణు వర్థన్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటారు. ఈ విధంగా ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థి తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో గెలుపును ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ తరహా రాజకీయ వ్యూహాలు చర్చనీయాంశమవుతున్నాయి. కాగా, నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అన్నీ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.