|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:17 PM
పనితీరు బాగోలేదనే నెపంతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా టీసీఎస్ సుమారు 6,000 మంది ఉద్యోగులను అక్రమంగా తొలగించిందని ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎలా తొలగిస్తారని కిటు, ఏఐటీఈ, యునైట్ వంటి ప్రముఖ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.కంపెనీ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఉద్యోగుల సంఖ్య 19,755 మేర తగ్గింది. దీనిపై టీసీఎస్ సీహెచ్‌ఆర్‌వో సుదీప్ కున్నుమల్ స్పందిస్తూ.. సుమారు 6,000 మంది ‘అసంకల్పిత తొలగింపు’ కిందకు వస్తారని, ఇది వ్యాపార అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని సమర్థించుకున్నారు. అయితే, టీసీఎస్ వాదనను ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇది ‘అసంకల్పిత తొలగింపు’ కాదని, పక్కా ప్రణాళికతో సాగిస్తున్న ‘బలవంతపు, అనైతిక తొలగింపు’ అని మండిపడుతున్నాయి. "ఉద్యోగులను అకస్మాత్తుగా ప్రాజెక్టుల నుంచి తప్పించి బెంచ్‌కు పంపుతున్నారు. అక్కడ కొన్ని గంటలు లేదా రోజుల్లోనే రాజీనామా చేయాలంటూ హెచ్‌ఆర్ విభాగం నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. చివరకు ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉద్యోగులను సైతం వదలడం లేదు. సెలవు పొడిగించాలని కోరితే, ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు" అని సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తొలగింపులపై వెంటనే విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు.