|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:16 PM
మంత్రి పదవి దక్కకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీయే తనను దారుణంగా మోసం చేసిందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కాంగ్రెస్ పార్టీని కాపాడటం కోసం నేను నా సొంత ఆస్తులు అమ్ముకున్నాను. అయినా పార్టీ నన్ను మోసం చేసింది" అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని ఆయన ఆరోపించారు. "బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి, ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ, పార్టీ కోసం కష్టపడిన నన్ను మాత్రం పక్కన పెట్టారు" అని రాజగోపాల్ రెడ్డి వాపోయారు.కాంగ్రెస్‌లోని కొందరు నాయకులే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.