|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 04:58 PM
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి సస్పెన్షన్‌కు గురైన కొన్ని వారాలకే ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తాను స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను పునరుత్తేజపరిచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థ రాష్ట్ర కమిటీకి నూతన సభ్యులను నియమించినట్లు వెల్లడించారు.ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కవిత తెలిపారు. కొత్తగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలోని 80 శాతానికి పైగా పదవులను బడుగు, బలహీన వర్గాల వారికి కేటాయించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత లకావత్ రూప్ సింగ్‌ను నియమించడం ఈ కోవలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. సీనియర్ నేత హరీశ్ రావుతో పాటు మరికొందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె తన సొంత సంస్థ అయిన జాగృతిని బలోపేతం చేయడంపై దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.