|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:53 PM
హెచ్-1బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూటిగా స్పందించారు. 'మన ప్రతిభను చూసి కొందరు భయపడుతున్నట్టుంది' అని వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా భారత్ విజేతగా నిలుస్తుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక వీడియో పోస్ట్ చేశారు. మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8గా ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఆర్థికవేత్తల అంచనాలను మించి ఇండియా వృద్ధి అప్రతిహతంగా సాగుతోందన్నారు. ఏదిఏమైనా భారత్ విజేతగా నిలవడం ఖాయమన్నారు. భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచం గుర్తించిందని, పలు దేశాలు మనతో స్వేచ్ఛా వాణిజ్యానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. వాణిజ్యం పెంచుకుని, భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఆయా దేశాలు కోరుకుంటున్నాయని అన్నారు. కొందరు మన ప్రతిభను చూసి కొంచెం భయపడుతున్నారని, దానికి కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఛలోక్తి విసిరారు.