|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 04:22 PM
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన సత్తా చాటేందుకు ఈ ఉపఎన్నికను వేదికగా మలుచుకోవాలని భావిస్తున్న ఆమె, తెలంగాణ జాగృతి తరఫున సొంత అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్ రెడ్డి సోమవారం కవితతో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ సహా పలు కీలక రాజకీయ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాగృతి నుంచి విష్ణువర్థన్ రెడ్డిని బరిలోకి దించే విషయం దాదాపు ఖరారైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ భేటీ అనంతరం విష్ణువర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో జరిగే దసరా వేడుకలకు కవితను ఆహ్వానించడానికే తాను కలిశానని, దీనికి రాజకీయాలు ఆపాదించవద్దని ఆయన కోరారు.మరోవైపు, బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తనకంటూ ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకునే పనిలో కవిత నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె తన కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగుగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ఆమె ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.