|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 07:55 PM
తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, అధునాతన సాంకేతికత వినియోగంలో దేశంలో ఇతర బోర్డుల కంటే ఉన్నతంగా ఉన్న జలమండలి.. ఇప్పుడు వినియోగదారుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి AI(Artificial Intelligence) అనే అధునాతన సాంకేతికతను వినియోగిస్తోంది. జలమండలి గత సంవత్సర కాలంలో మెట్రో కస్టమర్ కేర్(ఎంసీసీ)లో నమోదు అయినా ఫిర్యాదులను AI ద్వారా కొన్ని రోజులగా ఐటీ విభాగపు అధికారులు విశ్లేషిస్తున్నారు.గత సంవత్సర కాలంలో ఎంసీసీలో నమోదైన ఫిర్యాదులను, ట్యాంకర్ బుకింగ్ వివరాలను AI సాంకేతికత సాయంతో గత కొన్ని రోజులుగా విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలో ఏయే సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయో, ఏయే ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు, తరుచూ నమోదవుతున్న ఫిర్యాదులను వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు.అలాగే, గత సంవత్సర కాలంగా ట్యాంకర్ బుకింగ్ ల వివరాలతో ఏయే డివిజన్ లో అత్యధికంగా బుకింగ్ లు అవుతున్నాయో, ఏయే ప్రాంతాలతో పాటు అత్యధికంగా ట్యాంకర్ లను బుక్ చేసిన వినియోగదారుల వివరాలను సైతం, AI సాంకేతికతతో విశ్లేషించారు.కాగా గత సెప్టెంబరు 1 నుంచి.. ఇప్పటివరకు 6 లక్షల 50 వేలకు పైగా వివిధ సమస్యలపై ఫిర్యాదులు జలమండలి కస్టమర్ కేర్ కు అందగా, 12 లక్షలపైగా వాటర్ ట్యాంకర్ లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు.ఈ ప్రాంతంలో గత వేసవిలో అత్యధిక ట్యాంకర్ బుకింగ్స్ నమోదు అయినట్టు AI సాంకేతికత ద్వారా గుర్తించారు. అలాగే జలమండలి మొత్తం ఓ ఆర్ ఆర్ పరిధిలోని కీలక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం ప్రారంభించింది.
ఈ వివరాలతో.. అత్యధికంగా ట్యాంకర్ బుక్ చేసిన టాప్ 10 వినియోగదారులను AI సాయంతో గుర్తించారు. అందులో అత్యధికంగా ట్యాంకర్ బుక్ చేసిన ప్రాంతాలలో ప్రగతినగర్ లోని సౌతన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ గత సంవత్సరంలో 674 ట్యాంకర్ లను బుక్ చేసినట్టు తేల్చారు.ఈ నేపథ్యంలో ప్రగతీనగర్ లో నీటి సరఫరా, అత్యధిక ట్యాంకర్ బుకింగ్ వివరాలతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో కలిసి, సమస్యాత్మక ప్రాంతాలను స్థానికులతో పర్యటించారు. ఈ ప్రాంతాల్లో గతంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 15 రోజులకోసారి నీటి సరఫరా ఉండేదని, తరువాత జలమండలి చొరవతో పైపు లైన్లు మంజూరు చేయడంతో.. వారానికి ఒకసారి మంచి నీరు సరఫరా జరిగిందని స్థానికులు ఎండీకి చెప్పారు. అలాగే రెండు నెలల రెండు రోజులకు ఒక సారి తాగునీటి సరఫరా అవుతోందని.. అలాగే, రోజు విడిచి రోజు నీటి సరఫరా అందేలాగా స్థానికులు జలమండలి ఎండీకి విన్నవించుకున్నారు. అందుకే ఎండీ రోజు విడిచి రోజు నీటి సరఫరా చేపట్టవలసిన పనులను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రగతినగర్ సంపుకు ప్రత్యేక ఫీడర్ మెయిన్ అభివృద్ధి చేస్తే ఈ సమస్య తీరిపోతుందని, దానికి రూ.3 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు ఎండీకి వివరించారు. దానికి వెంటనే ప్రతిపాదనలను పరిశీలించిన ఎండీ, వెంటనే పనులు చేపట్టాలని ఆమోద ముద్ర వేశారు.
ఈ ప్రగతినగర్ ఎత్తైన ప్రాంతాల్లో ఉండటం, భూగర్భంలో ఎక్కువగా రాళ్లు కూడి ఉండటంతో.. బోర్లు సఫలం కాక, సఫలమైన వేసవిలో అంటడిగి పోవడంతో.. ఈ ప్రాంతవాసులు త్రాగునీరుకోసం జలమండలిపై అధారపడుతున్నట్లు గుర్తించారు. వీటితోపాటు వందకు పైగా గృహ సముదాయాలకు ఇంకుడు గుంతలు లేకపోవడంతో జలమండలి ట్యాంకర్ల మీద వేసవిలో ఆధారపడుతున్నట్లు విశేషించారు.
ఈ నేపథ్యంలో ఆరు వందలకు పైగా వాటర్ ట్యాంకర్ లను బుక్ చేసిన అపార్టుమెంటును అధికారులతో కలిసి సందర్శించారు. అపార్టుమెంటు ప్రాంగణంలో పాడైన బోర్ వెల్ ను గుర్తించిన ఎండీ వాటిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అపార్టుమెంటు వాసులకు సూచించారు. అలాగే, విశాలమైన అపార్టుమెంటు ఆవరణలో కొన్ని ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి ఆవరణలోని బోరు పనిచేసే అవకాశం ఉంటుందని, తద్వారా వచ్చే వేసవిలో ట్యాంకర్ బుక్ చేసే అవసరం రాదని ఈ సందర్భంగా ఎండీ వివరించారు. దానికి అవసరమైన సాంకేతిక సహాయం జలమండలి స్థానిక అధికారులు అందజేస్తారని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీజీఎం ఆనంద్ నాయక్, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్ర మోహన్, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.