|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 02:41 PM
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ దుర్ఘటనలో తెలంగాణలోని వారే కాకుండా ఏపీ, ఒరిస్సా సహా పలు రాష్ట్రాల వారు కూడా మృతి చెందారు. దీంతో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా ఇప్పుడు తొలిసారి ఈ ప్రమాద ఘటనపై సిగాచీ సంస్థ అధికారికంగా స్పందించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 33 మంది గాయపడినట్లు సిగాచీ కంపెనీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. గాయపడిన వారికి ఉచిత వైద్య సాయంతోపాటు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఈ ప్రమాద ఘటనపై వివేక్ కుమార్ స్టాక్ మార్కెట్లకు కూడా లేఖ రాసినట్టు వెల్లడించారు. ఈ ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని, నిజమైన కారణం తెలుసుకోవాలంటే ప్రభుత్వ విచారణ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ కార్యకలాపాలను తాత్కాలికంగా మూడు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు ఘటనస్థలాన్ని నేరుగా పరిశీలించారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలను గుర్తించారు, అందులో 16 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. అయితే, ఇంకా 11 మృతదేహాల గుర్తింపు చేపట్టాల్సి ఉంది. శిథిలాల కింద మరింతమంది ఉండే అవకాశం ఉన్నందున DNA పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో SDRF, సింగరేణి టీమ్స్ పాల్గొంటున్నాయి.