|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 02:47 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్న కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాలలో నిన్న ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. నేడు రేపు ఈ జిల్లాలలో వర్షాలు ఇదిలా ఉంటే నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురవడంతో పాటుగా, బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. బుధ, గురువారాల్లో ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు, ఉరుములు, మెరుపులతో గంటకు 30నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ దీంతో పాటు వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. గడిచిన 24గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో అత్యధికంగా 6.10 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్ లోనూ వర్షం ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి పరిధిలోని సెంట్రల్ మరియు సిటీలో కూడా ఒక మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. షేక్ పేట లో 43.8 మిల్లీమీటర్లు, బంజారాహిల్స్ లో 43 మిల్లీమీటర్లు, ఖైరతాబాద్లో 40 మిల్లీ మీటర్లు, గన్ ఫౌడ్రీ లో 37 మిల్లీమీటర్లు, మలక్పేట్ లో 37 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపధ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రంగంలోకి హైడ్రా ఇక వర్షాలు కురవనున్న నేపధ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా పూర్తిస్థాయిలో హైడ్రా రంగంలోకి దిగుతుంది. వాటర్ లాగింగ్ పాయింట్లు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా తగిన చర్యలు చేపడుతుంది.ఇకపై మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు హైడ్రా పరిధిలో పని చేయనున్నాయి.