|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 12:57 PM
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోగానీ, రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు ఈ ఏడాది ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. దీంతో అక్రమాలకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తప్పుడు ప్రచారం.. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో చాలా మంది ఇప్పుడు వాటినే తింటున్నారు. గతంలో దొడ్డు బియ్యం అమ్ముకుని సన్న బియ్యం కొనుక్కునేవారు. నేడు పరిస్థితి మారింది. అయితే ఈ సన్న బియ్యంపై ఇప్పుడు తప్పుడు ప్రచారం జరుగుతోంది. రేషన్ బియ్యం నీటిలో తేలడంతో ప్లాస్టిక్ బియ్యం కలిపారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులు స్పందిస్తున్నారు. ఈ బియ్యం ప్లాస్టిక్ కాదని, పోషకాహారంతో బలపరిచిన (ఫోర్టిఫైడ్) బియ్యం అని స్పష్టం చేస్తున్నారు. ఈ బియ్యంలో ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్.. రేషన్ బియ్యం నీటిలో తేలడంతో ప్లాస్టిక్ బియ్యం అనే అపోహ ప్రజలలో వ్యాపించింది. ఈ అనుమానాలు చాలా మంది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా.. అందరూ ఈ ప్లాస్టిక్ ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, వాస్తవానికి ఫోర్టిఫైడ్ బియ్యం తేలికగా ఉంటాయి. పోషకాలు కలుపడంతో నీటిలో తేలుతాయి. ఈ బియ్యాన్ని చూసి చాలా మంది ప్లాస్టిక్ అని ప్రచారం చేస్తునానరు. వాస్తవానికి ఈ బియ్యంతో ఎలాంటి హాని ఉండదు. పోషకాహార లోపంతో బాధపడే వారికి ఈ బియ్యం ఆ సమస్య తీరుస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో ఈ పోషకాలు.. పోషకాహార లోపం ఉన్నవారిలో ఆ లోటు తీచ్చేందుకు రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుతున్నారు. ఈ బియ్యంలోని పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇందులోని ఐరన్ రక్తహీనత(అనీమియా) నివారణకు సహాయపడుతుంది. జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఎదుగుదలకు దోహదపడుతుంది. ఫోలిక్ యాసిడ్ గర్భిణులలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇక విటమిన్ బీ12 నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక వ్యవస్థలు బలోపేతం చేస్తుంది.