|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 06:27 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా వర్ష సూచన జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.