![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు తీరు, మహిళలకు చేసిన వాగ్దానాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. ఇదే సమయంలో, పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు.గోదావరి జలాల అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంపై కవిత స్పందిస్తూ... "యస్.. అసెంబ్లీలో కచ్చితంగా చర్చిద్దాం. అయితే, ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలి" అని డిమాండ్ చేశారు. కేసీఆర్ దమ్ము ఏమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె అన్నారు. ఈ విషయాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధాకరమని, ఆయన మరింత హుందాగా వ్యవహరించాలని సూచించారు.