|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 04:19 PM
టోలిచౌకికి చెందిన 65 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల మాయమాటలకు బలై, రూ. 74.36 లక్షలు కోల్పోయాడు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకుల ద్వారా పెట్టుబడి పెట్టమని చెప్పి, వృద్ధుడి నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు భారీ మొత్తాన్ని కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాల సేకరణ ద్వారా నిందితులు మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రిషికేష్ జయవంత్ కాంబ్లే, మహమ్మద్ సుల్తాన్ షేక్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితులపై దేశవ్యాప్తంగా 38 సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు, తెలంగాణలో మూడు కేసులు నమోదైనట్లు తేలింది.
పోలీసులు నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నమ్మకమైన లింకులు, యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఆన్‌లైన్ లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని హెచ్చరిస్తున్నారు.