|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 08:18 PM
మలక్‌పేట్ నల్గొండ చౌరస్తాలో సీవరేజ్ మరమ్మత్తు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. మలక్‌పేట్ అక్బర్ ప్లాజా వద్ద మురుగు సమస్య తలెత్తి ట్రాఫిక్ ఆటంకం ఏర్పడింది. దీంతో జలమండలి అధికారులు పర్యటించి రెండు దశాబ్ధాల క్రితం సీవరేజ్ లైను శిథిలమైపోవడంతో అవుట్‌లెట్ లేక వర్షం కురిసిన సమయాల్లో సీవరేజ్ రహదారిపై పొంగుతున్నట్టు గుర్తించారు. ఇదే ప్రాంతంలో జీహెచ్ఎంసీ వాననీటి కాలువ ఉండడం, ట్రాఫిక్ రద్దీ ఉండడం, సీవరేజ్ లైన్లు ధ్వంసమైన ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించలేకపోయారు.ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి నల్గొండ చౌరస్తా నుంచి మలక్‌పేట్ ఆర్‌యూబీ వరకు సీవరేజ్ లైన్ల నిర్మాణం చేపట్టడానికి అధికారులతో చర్చించారు. ఈ కొత్త సివరేజ్ లైన్లవల్ల తాత్కాలికంగా మురుగు సమస్య తలెత్తకుండా ఉంటుందని అన్నారు. అలాగే సమీపంలోని భవణాలనుంచి ఉత్పన్నమయ్యే సీవరేజ్‌ను ఎక్కడికక్కడే కాకుండా ఓకే అవుట్‌లెట్ వద్ద అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సమీపంలోని అన్నీ సీవరేజ్ లైన్లను, మ్యాన్‌హోళ్లను డీ సిల్టింగ్ చేసి మురుగు పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారంకోసం ఇరు శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని అన్నారు.
నగరంలోని సీవరేజ్, వాననీటి కాలువ అనుసంధానం అయ్యే పాయింట్లను గుర్తించాలని, ఆ ప్రాంతాల్లో రెండు లైన్లను వేరువేరుగా నిర్మిస్తే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుందని భావించారు. దీనికోసం ఇరుశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.