|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:50 PM
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశ ప్రజలకు చల్లని కబురు అందించింది. దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే.. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ, ఈ ఏడాది ఆరు రోజులు ముందుగానే వచ్చేశాయి. కాగా, 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అలాగే 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఇక, ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.