|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:18 PM
ఈనెల 30న కలెక్టరేట్ ముందు జరుగనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు పిలుపునిచ్చారు. శనివారం నాడు ఆత్మకూరు మండలం మెట్లంపల్లి గ్రామంలో ఉపాధిహామీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, అక్కడి కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ నిధులను తగ్గిస్తూ వస్తోందని విమర్శించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పనుల సంఖ్య తగ్గి, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఉపాధిహామీ కూలీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా, ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నాను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు.