|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:20 PM
మండలంలోని ఉపాధిహామీ కూలీల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని సీఐటీయూ మండల కార్యదర్శి జోషి డిమాండ్ చేశారు. శనివారం నాగమ్మ చెరువు వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించిన ఆయన, అక్కడ పని చేస్తున్న కూలీలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జోషి, “కూలీలకు సరైన సమయంలో వేతనాలు అందకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న కూలీల డబ్బులు చెల్లించాలి” అన్నారు.
ఇక ఉపాధి హామీ కూలీ రోజువారీ వేతనాన్ని రూ.600కి పెంచాలని, వార్షికంగా అందించే పని దినాలను 100 నుంచి 200కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకాన్ని నిజమైన ప్రజాపథకంగా మలచాలంటే కూలీల అవసరాలను ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని జోషి పిలుపునిచ్చారు.