|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 06:00 PM
పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన ‘కేజీఎఫ్’ సిరీస్‌లోని మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ క్లైమాక్స్‌లో మూడో భాగానికి సంబంధించిన హింట్ ఇవ్వడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో, ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరుతో వైరల్ అవుతున్న ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. బుధవారం నుంచి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ‘కేజీఎఫ్ 3’ ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తయిందని చెబుతున్న ఈ పోస్టర్‌ను ప్రశాంత్ నీల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ పోస్టర్ ఎంతవరకు నిజమనే దానిపై స్పష్టత లేదు. అది ప్రశాంత్ నీల్ అధికారిక ఖాతా నుంచి వచ్చిందా, లేక ఏదైనా పేరడీ అకౌంట్ నుంచి వైరల్ అయిందా అనే దానిపై చర్చ నడుస్తోంది. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Latest News