|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 05:03 PM
అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్న చైనా మరో కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రణాళికలు సజావుగా సాగుతున్నాయని గురువారం స్పష్టం చేసింది. అదే సమయంలో, తమ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్న తదుపరి వ్యోమగాముల బృందాన్ని కూడా పరిచయం చేసింది.చైనా మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ అధికార ప్రతినిధి జాంగ్ జింగ్బో మాట్లాడుతూ.. "చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం సజావుగా కొనసాగుతున్నాయి. లాంగ్ మార్చ్ 10 రాకెట్, మూన్ ల్యాండింగ్ సూట్లు, అన్వేషణ వాహనం వంటి వాటి అభివృద్ధిలో మంచి పురోగతి సాధించాం. 2030 నాటికి చంద్రుడిపైకి చైనా వ్యోమగామిని పంపాలన్న మా లక్ష్యం స్థిరంగా ఉంది" అని ధీమా వ్యక్తం చేశారు.ఇందులో భాగంగా, చైనా తమ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు కొత్త వ్యోమగాముల బృందాన్ని పంపేందుకు సిద్ధమైంది. జాంగ్ లూ, వూ ఫీ, జాంగ్ హాంగ్‌జాంగ్‌లతో కూడిన ఈ బృందం శుక్రవారం రాత్రి 11:44 గంటలకు జ్యుక్వాన్ లాంచ్ సెంటర్ నుంచి బయలుదేరనుంది. ఈ బృందంలోని జాంగ్ లూ గతంలో షెంజౌ 15 మిషన్‌లో పనిచేశారు. మిగిలిన ఇద్దరు వ్యోమగాములకు ఇదే తొలి అంతరిక్ష యాత్ర. వారు స్పేస్ స్టేషన్‌లో ఆరు నెలల పాటు ఉండి పరిశోధనలు చేస్తారు.