|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 08:34 PM
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శివాలయాలను దర్శించుకునేవారు చాలా మంది ఉంటారు. దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తుల రద్దీతో ఈ నెల రోజులు కిక్కిరిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఆలయాల్లో రద్దీ నెలకొంటోంది. ఇక తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అరుణాచలం (తిరువణ్ణామలై)కు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇక ప్రతీ పౌర్ణమికి అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తులు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం కార్తీక మాసం వేళ.. మరింత ఎక్కువమంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు.
ఈ నేపథ్యంలోనే నవంబర్ 3వ తేదీన జరగనున్న కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా.. శివుడిని ఆరాధించేందుకు అత్యంత విశిష్టమైన రోజు అని అంతా భావిస్తారు. ఈ క్రమంలోనే అరుణాచలంకు భక్తుల రద్దీ పెరగనుంది. ఇది దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హైదరాబాద్ నుంచి అరుణాచలంకు నేరుగా చేరుకోవడానికి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని.. భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని కీలక నిర్ణయం తీసుకుంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రాకపోకల కోసం హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు తాజాగా టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఇప్పటికే ఈ స్పెషల్ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపిన ఆర్టీసీ అధికారులు.. భక్తుల రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని అదనపు బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే సమయంలో రద్దీ, వసతి సమస్యలు తీవ్రంగా ఉండేవని.. అయితే ఈసారి అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు ప్రారంభించడంతో భక్తులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా దిల్‌షుక్‌నగర్‌తో పాటు ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టిక్కెట్ కౌంటర్లు, ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది.