|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:10 PM
1953లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారి అధిరోహించిన చారిత్రక బృందంలో జీవించి ఉన్న చివరి వ్యక్తి కాంచా షెర్పా (89) గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఖాట్మండులోని కపన్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారని నేపాల్ పర్వతారోహణ సంఘం అధ్యక్షుడు ఫుర్ గెల్జే షెర్పా ధ్రువీకరించారు. కాంచా మరణంతో ఆ చారిత్రక బృందంలో ఇక ఎవరూ జీవించి లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1953 మే 29న సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే ఎవరెస్ట్‌ను తొలిసారి అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సాహస యాత్రను విజయవంతం చేసిన 35 మంది సభ్యుల కీలక బృందంలో కాంచా షెర్పా ఒకరు. 1937 మార్చిలో జన్మించిన ఆయన, కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆ యాత్రలో పాలుపంచుకున్నారు. హిల్లరీ, టెన్జింగ్‌లతో పాటు శిఖరానికి అత్యంత సమీపంలో ఉండే చివరి క్యాంపు వరకు వెళ్లిన ముగ్గురు షెర్పాలలో కాంచా కూడా ఉండటం విశేషం.