|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 06:34 PM
ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకాల మరణం తర్వాత యాంటీ ఏజింగ్ మందుల వాడకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి సహజ ఆయుష్షు వందేళ్లు కాదని, సరైన జీవనశైలిని పాటిస్తే 150 నుంచి 200 ఏళ్ల వరకు జీవించవచ్చని ఆయన అన్నారు.షెఫాలీ జరీవాలా మృతిపై రాందేవ్ బాబా ఈరోజు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. "మానవ శరీరం ఒక అద్భుతం. కానీ మన మెదడు, గుండె, కాలేయంపై మనమే ఎక్కువ భారం మోపుతున్నాం. 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని 25 ఏళ్లకే తినేస్తున్నాం" అని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు 60 ఏళ్లు దాటినా యోగా, ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్లే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు.గతంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా, ఇప్పుడు షెఫాలీ జరీవాలా లాంటి యువతరం అకాల మరణాలపై స్పందిస్తూ, "వారి హార్డ్‌వేర్ బాగున్నా, సాఫ్ట్‌వేర్ లోపభూయిష్టంగా ఉంది. పైకి కనిపించే లక్షణాలు బాగానే ఉన్నా, శరీర వ్యవస్థ దెబ్బతింది" అని ఆయన వ్యాఖ్యానించారు. పైపై మెరుగుల కన్నా అంతర్గత ఆరోగ్యం చాలా ముఖ్యమని ఆయన సూచించారు.