|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 06:26 PM
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అందించినట్లు చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసేందుకు వెళితే.. తన అనుచరులను బెదిరించినట్లు రాజాసింగ్ మీడియా ముందు వాపోయారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే 10 మంది మద్దతు అవసరమని.. తనకు మద్దతు ఇస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తమ అనుచరులను పార్టీ ముఖ్యనేతలు బెదిరించారని చెప్పారు. బీజేపీ ముఖ్య నేతల తీరుతో తాను కలత చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీ ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై గెలిచినందున ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని.. ఆ లేఖను కిషన్ రెడ్డి గారే స్వయంగా స్పీకర్‌కు పంపపాలని కోరారు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక ముందుగానే పూర్తయిందని.. పార్టీ ఓడిపోవాలని కోరుకునేవారు బీజేపీలోనే ఎక్కువ ఉన్నారని రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు.
కాగా, బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచదర్‌రావు పేరు దాదాపు ఖరారైంది. దీనిపై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇవాళ మధ్యాహ్నమే ఓ వీడియో రిలీజ్ చేశారు. పార్టీలో బూతు స్థాయి నుంచి కీలక నేతల వరకు అందరూ కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఏక పక్షంగా అధ్యక్షుడిని ఎంపిక చేయటం సరైన నిర్ణయం కాదని అన్నారు. అయితే ఆయన గతంలోనూ పలుమార్లు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజీనామా చేస్తానని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుల నియామకంపైనా రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీ తన సూచనలను పట్టించుకోలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వెనుకబడిన తరగతులు (BC) లేదా షెడ్యూల్డ్ కులాలు (SC) చెందిన వ్యక్తిని నియమించాలని కోరితే తనన సూచనను పట్టించుకోలేదన్నారు.
పార్టీలో కొంతమంది నేతల నుంచి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని.. బ్రోకరిజం జరుగుతోందని రాజాసింగ్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు వార్తలు వచ్చాయి. రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పదే పదే విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వారికి తొత్తులుగా మారిందని కూడా ఆరోపించారు. తాను హిందూ ధర్మ రక్షణ, గోరక్షణ వంటి అంశాలపైనే దృష్టి సారించాలనుకుంటున్నానని అన్నారు. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడటం వంటివి చేయడం వల్ల గతంలో పార్టీ నుంచి ఆయన సస్పెండ్‌కు గురయ్యారు. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషాహమల్ నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా తానే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని రాజేసింది. రాజాసింగ్ వ్యవహారం బీజేపీలో ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.