![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:52 PM
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆమె ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమంపై గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ఎకరాల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా రైతు భరోసా అందించడంలో విఫలమైందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఇది కాంగ్రెస్ నేతలకే తెలియాలని ఆమె అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అందుకే ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ నాయకులందరూ బాధితులేనని డీకే అరుణ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు కీలకమైన అంశాలపై సీబీఐ విచారణ కోరడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలని ఆమె నిలదీశారు.