![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 06:37 PM
చంద్రబాబును రేవంత్ పిలిచి హైదరాబాద్ బిర్యానీ తినిపించి, గోదావరి నీళ్లను కానుకగా ఇచ్చారని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడం పరిపాటిగా మారిందని, 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం తలపెట్టరని కవిత స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ సంతకంతో కూడిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారని కవిత గుర్తు చేశారు. సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్ల మొత్తాన్ని పెంచేలా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వేలాది పోస్టుకార్డులను సోనియా గాంధీకి పంపుతున్నామని తెలిపారు. "కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్న హామీని విస్మరించారు. వికలాంగుల పెన్షన్ ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచకుండా మోసం చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైంది?" అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని కవిత పేర్కొన్నారు.