![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 06:32 PM
భారత అంతరిక్ష యాత్రల చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతమైంది. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి విజయవంతంగా పయనమయ్యారు. ఈ అంతర్జాతీయ బృందానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక ప్రయోగం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ శుభాంశు శుక్లాకు, మిషన్ బృందానికి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ, "భారత్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించారు. మీ ప్రయాణం పట్ల దేశం మొత్తం గర్వంగా, సంతోషంగా ఉంది. మీరు, యాక్సియం-4 మిషన్‌లోని ఇతర దేశాల వ్యోమగాములు 'వసుధైక కుటుంబం' అనే భావనను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. నాసా, ఇస్రో మధ్య నెలకొన్న శాశ్వత భాగస్వామ్యానికి ఈ మిషన్ అద్దం పడుతోంది. ఈ యాత్ర సంపూర్ణంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు నిర్వహించే ప్రయోగాలు, శాస్త్రీయ అధ్యయనాలు భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు మార్గదర్శకంగా నిలుస్తాయి" అని పేర్కొన్నారు.