![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:46 PM
హార్వర్డ్ యూనివర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. యూనివర్సిటీలో కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులు చేరకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద హార్వర్డ్‌కు ఉన్న గుర్తింపును రద్దు చేసినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఫెడరల్ చట్టాలను హార్వర్డ్ యూనివర్సిటీ పదేపదే ఉల్లంఘిస్తోందని, అందుకే ఈ కఠిన చర్యలు తీసుకున్నామని క్రిస్టీ నోయెమ్ ఒక ప్రకటనలో తెలిపారు. "దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు ఇదొక హెచ్చరికగా భావించాలి. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడం అనేది ఒక సౌలభ్యం మాత్రమే, హక్కు కాదు. ఫెడరల్ చట్టాలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైనందున ఆ సౌలభ్యాన్ని రద్దు చేశాం," అని ఆమె పేర్కొన్నారు.