![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:32 PM
ఇటీవల ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‌గా కన్నడ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్టర్2 . చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. అజయ్ రావు హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమాకు పవన్ భట్ దర్శకత్వం వహించగా ప్రకాశ్ బెలవాడి , K.G.F ఫేమ్ అర్చన జోయిస్, టీఎస్ నాగాభరణ కీలక పాత్రల్లో నటించారు. రెండు నెలల క్రితం ఏప్రిల్18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కన్నడ నాట మంచి విజయాన్ని నమోదు చేసింది. సుమారు రెంఉ గంటల నిడివితో గత వారం ప్రపంచ వ్యాప్తంగా కన్నడతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చింది.కథ విషయానికి వస్తే.. తన ఏడేండ్ల కూతురు రాధన్యను ఓ ఎమ్మెల్యే తమ్ముడు పాడు చేశాడని తల్లి నివేదిత కోర్టుకెళుతుంది. అయితే అక్కడ నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం దొరకడం లేదని ఆవేదన చెందుతూ ఓ రోజు కోర్టు ఆవరణలోనే నిందితుడిని అందరి ముందే గన్‌తో కాల్చి చంపుతుంది. దాంతో ఆమె జైలే పాలవుతుంది. ఆమె ఒంటరి కావడంతో కేసును వాదించడానికి ఎవరూ ముందుకు రారు. అదే సమయంలో భరత్ అనే కుర్రాడు లా పూర్తి చేసి ఓ సీనియర్ అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ స్టార్ట్ చేసి తక్కువ సమయంలోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో నివేదిత దుస్తితి చూసి చలించిన భరత్ ఆ కేసు టేకప్ చేస్తాడు. మరోవైపు తన తమ్ముడిని చంపిన నివేదితను బయటకు రాకుండా కఠిన శిక్ష వేయించాలని దేశంలోనే పేరున్న ఓ పెద్ద క్రిమినల్ లాయర్ రాబర్ట్ డిసౌజాకు ఎమ్మెల్యే భారీగా డబ్బు ఇచ్చి రంగంలోకి దింపుతాడు. దీంతో పెద్ద లాయర్ కావడంతో ఓటమి ఖాయమని భరత్‌కు హెల్ప్ చేయడానికి చాలా మంది ముందుకు రారు.ఈ క్రమంలో భరత్ అంత పెద్ద లాయర్‌ను ఎదుర్కొంటూ ఆ కేసును ఎలా వాదించాడు, ఇద్దరి మధ్య ఎలాంటి వాదనలు, ప్రతివాదనలు జరిగాయి, ఎవరు పై చేయి సాధించారు చివరకు ఓ యువకుడిని చంపి నేరం చేసిన నివేదితను బయటకు ఎలా తీసుకు వచ్చాడనే ఈ సినిమా కథ. మనం ఇప్పటి వరకు చూసిన చిత్రాల లాగే ఈ చిత్రం ఉంటుందని ముందే తెలిసిన్నప్పటికీ కథను నడిపించిన విధానం భిన్నంగా ఉంటుంది. అన్ని సినిమాల్లో జైలులో ఉన్న నిరపరాధులను హీరో విడిపిస్తే.. ఈ చిత్రంలో మాత్రం కోర్టులో అందరి ముందే నేరం చేసిన ఓ మహిళను హీరో ఏ విధంగా బయటకు తీసుకు వచ్చాడనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఎలాంటి సినిమాటిక్ లిబరిటీస్ తీసుకున్నారనే మాట రాకుండా చట్టంలో ఉన్న పాయింట్లను బేస్ చేసుకుని ఈ స్టోరినీ అద్భుతంగా తీర్చిదిద్దారు.సినిమా మొదట్లో హీరో అనవసర ప్రేమ వ్యవహారం తప్పితే సినిమా అంతా కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ ఫైనల్ హియరింగ్ సమయంలో హీరో చెప్పే డైలాగ్స్ గూస్‌బమ్స్ తీసుకు వచ్చేలా ఉంటాయి. అందుకు భగవద్గీత శ్లోకాలను వాడుకున్న విధానం, ఏళ్లకు ఏళ్లు కేసులు పెండింగ్, సరైన సమయానికి న్యాయం లభించకపోవడం అనే పాయింట్లు చర్చించిన విధానం ఆకట్టుకుంటుంది. కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఎలాంటి జంకుబొంకు లేకుండా హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.
Latest News