|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 08:15 PM
రెండు పర్యాయాలు తనను శాసనసభ్యునిగా గెలిపిస్తే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానని కాంగ్రెస్ నాయకుడు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలకు, నియోజకవర్గాలకే నిధులు తరలివెళుతున్నాయని ఆయన ఆరోపించారు. తమను శాసనసభ్యులుగా గెలిపిస్తేనే కదా తాము కూడా మంత్రులు, ముఖ్యమంత్రులం అయ్యేది అని ఆయన వ్యాఖ్యానించారు.ఇటీవల మాజీ శాసనసభ్యుడు ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కూడా ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ద్రోహం చేసి సొమ్ము చేసుకున్న వారికి తిరిగి పార్టీలో ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేశారు. హత్యలు చేసేవారికి కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండబోదని ఆయన అన్నారు. సొంత సోదరుడినే చంపిన వారు రాజకీయాల కోసం తనను కూడా చంపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జెడ్ కేటగీరి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.