|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 04:46 PM
టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్‌కు మార్కెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సిరీస్‌లోని మూడు ప్రధాన మోడళ్లకు వినియోగదారుల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తుండగా, కొత్తగా విడుదల చేసిన ‘ఐఫోన్ ఎయిర్’ మోడల్ మాత్రం కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. యాపిల్ ఎంతో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్లిమ్ మోడల్‌కు ఆశించిన స్థాయిలో గిరాకీ లేదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీకి చెందిన విశ్లేషకుడు ఎరిక్ వుడ్రింగ్ పరిశోధన ప్రకారం, ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, మరియు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లకు మార్కెట్లో బలమైన డిమాండ్ కనిపిస్తోంది. యాపిల్ సప్లై చైన్ సమాచారం ఆన్‌లైన్ స్టోర్‌లోని షిప్పింగ్ అంచనాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు మ్యాక్‌రూమర్స్ కథనం పేర్కొంది. ఈ మూడు మోడళ్లలో కీలకమైన మార్పులు, సరికొత్త డిజైన్ ఉండటంతో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారిని ఇవి బాగా ఆకర్షిస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.