|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 06:40 PM
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యమని, గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరేస్తామని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన తొలిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను సౌమ్యుడిగా భావించవద్దని, ప్రజా సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన హెచ్చరించారు. ఎంతోమంది కార్యకర్తలు, నేతల త్యాగాల పునాదులపైనే బీజేపీ నేడు ఈ స్థాయిలో నిలిచిందని రామచందర్‌రావు అన్నారు. "ప్రజాస్వామ్యబద్ధమైన, వికసిత తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం. అందుకే ప్రజలు మనవైపు ఆశగా చూస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి" అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి జాతీయ నాయకత్వం సహకారంతో తెలంగాణలో పార్టీని మరింత ముందుకు నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.