![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 07:34 PM
బీఆర్ఎస్ శ్రేణులకు కీలక విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని చెప్పారు. అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావుండకూడదన్నారు. ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్నీ మెయిన్ స్ట్రీమ్‌కి తీసుకొచ్చిన మన గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి, ఆయన మిత్రులకే ఈ పాపం అని కేటీఆర్ అన్నారు. 'బీఆర్‌ఎస్ పార్టీ సోదర సోదరీమణులందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ పైన ముఖ్యమంత్రి ఆయన అనుచరగణం చేస్తున్న బురదజల్లే కుట్రపూరిత కార్యక్రమంపై చట్టబద్ధమైన ప్రక్రియను నమ్మి ముందుకు సాగుదాం. పార్టీపైన మీకు ఉన్న ప్రేమను, నిబద్ధతను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. అదే విధంగా పార్టీపై, నాయకులపై జరుగుతున్న దుష్ప్రచారంపై మీలో ఉన్న ఆవేదనను కూడా నేను అర్థం చేసుకోగలను. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారం అంశాలుగా సమాజంలో రోజువారి సాధారణ అంశాలుగా మారిపోతాయి. అరాచకత్వం పెట్రేగిపోతుంది. ఈ విషయాల్లో న్యాయస్థానాలను ఆశ్రయిద్దాం. ఈ సిగ్గుమాలిన బురదజల్లే రాజకీయాలకు మనం చట్టబద్ధంగా సమాధానం ఇవ్వాలి. మనం అందరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలపై, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలపై ప్రశ్నించడం పైనే దృష్టి సారించాలి' అని కేటీఆర్ అన్నారు.