|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 07:05 PM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణతో కేసులోని చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. కేవలం రాజకీయ నిఘా కోసమే SIBలో ఎస్వోటీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభాకర్ రావు సిట్‌కు అంగీకరించినట్లు తెలిసింది. ఈ అక్రమ కార్యకలాపాల కోసమే అప్పటి డీఎస్పీ ప్రణీత్ రావును SIBకి తీసుకొచ్చానని ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని వారి ఫోన్ సంభాషణలను అక్రమంగా వినే ఉద్దేశంతోనే ప్రణీత్ రావు ఆధ్వర్యంలో SOT విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సిట్‌కు ప్రభాకర్ రావు వివరించినట్లు తెలిసింది.
ముఖ్యంగా 2023 శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారితో సహా ఇతర ప్రముఖుల ఫోన్‌లపై ఎస్వోటీ నిఘా ఉంచేందుకు అనుమతులు ఎలా వచ్చాయని సిట్ ఆరా తీయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. నిఘా ఉంచాల్సిన ఫోన్ నంబర్ల లిస్టును డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలో ప్రభాకర్ రావు పేరుతోనే ఉన్నతాధికారులకు వెళ్లేవని తెలిసింది. ఆ ఫోన్ నంబర్లపై నిఘా ఉంచడానికి కారణం చెప్పే సమయంలో 'మావోయిస్టు' ముసుగు వాడినట్లు సమాచారం. మావోయిస్టులకు డబ్బులు, ఔషధాలు, ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ ప్రముఖులందరికీ ముద్ర వేసి అక్రమంగా వారి కాల్ రికార్డ్స్ వినేందుకు అనుమతులు పొందారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కాల్ రికార్డులను నిక్షిప్తం చేసిన హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారు.
ప్రణీత్ రావు చేసిన ఒక పొరపాటు ప్రభాకర్ రావుకు కష్టాలు తెచ్చిపెట్టింది. 2023 డిసెంబరులో ప్రభాకర్ రావు బృందం తమ సెల్ ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను పకడ్బందీగా డిలీట్ చేసింది. ధ్వంసం చేసి మూసీలో పడేసిన హార్డ్‌డిస్క్‌లను వెలికితీసి FSL ద్వారా విశ్లేషించినా ఎలాంటి విలువైన సమాచారం లభ్యం కాలేదు. అయితే ప్రణీత్ రావు 2023 జూన్ వరకు తాను వినియోగించిన ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయలేదు. ఈ మిస్టేక్‌తో ప్రభాకర్ రావు దొరికిపోయాడు. FSL విశ్లేషణ క్రమంలో ఆ ఫోన్‌లో సేవ్ చేసిన రాజకీయ నేతల సంభాషణలు తాజాగా సిట్ చేతికి చిక్కాయి.
దీంతో రాజకీయ నిఘా జరిగిందనేందుకు కీలక ఆధారాలు లభ్యమైనట్లయింది. ప్రస్తుతం వీటి గురించి ప్రభాకర్ రావు సమాధానం చెప్పాల్సి ఉంది. సిట్ అధికారులు శనివారం ప్రభాకర్ రావును సుమారు 9 గంటలపాటు విచారించారు. ఈనెల 17న మరోసారి విచారణకు రావాలని ఆదేశించడంతో పాటు, ఆయన సెల్ ఫోన్లను జప్తు చేయాలని సిట్ నిర్ణయించింది.