|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 08:53 PM
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు విస్తరించింది. దేశంలోనే ప్రధాన టెక్నాలజీ హబ్‌గా దినదినాభివృద్ధి చెందుతూ, ఐటీ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది.ఇటీవల విడుదలైన ‘సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ - 2024’ నివేదికలో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో కర్ణాటక రాజధాని బెంగళూరు మొదటి స్థానంలో, వియత్నాం దేశంలోని హో చి మిన్ సిటీ రెండో స్థానంలో, దేశ రాజధాని న్యూ ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి.సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ - 2024 ప్రకారం, ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో ఆసియా ఖండం కీలక పాత్ర పోషిస్తోంది. 2033 నాటికి ఏఏ నగరాలు అత్యంత సమర్థవంతమైన అభివృద్ధిని సాధిస్తాయో అంచనా వేస్తూ ఈ నివేదిక రూపొందించబడింది. ఇందులో ఆర్థిక స్థాయి, జనాభా పెరుగుదల, వ్యక్తిగత సంపద వంటి పలు అంశాలను ప్రమాణాలుగా తీసుకున్నారు.సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్‌తో పాటు సావిల్స్ రెసిలియంట్ సిటీస్ ఇండెక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలపై అధ్యయనం నిర్వహించింది. రాబోయే దశాబ్దంలో వేగంగా అభివృద్ధి చెందనున్న నగరాల జాబితాను రూపొందించింది. ఆ రిపోర్టు ప్రకారం, ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీస్ టాప్ 15లో 14 నగరాలు ఆసియా ఖండంలోనే ఉన్నట్లు తేలింది. అంతేకాదు, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో దాదాపు 90 శాతం పట్టణాభివృద్ధి నమోదవుతోందని కూడా పేర్కొంది.మరోవైపు యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం, 2050 నాటికి ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లో నివసించనున్నారని వెల్లడించింది.హైదరాబాద్ విషయంలో, సావిల్స్ నివేదికలో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, రియల్ ఎస్టేట్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అని స్పష్టంగా పేర్కొంది. ప్రత్యేకంగా ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేశానికి అగ్రగాములుగా నిలుస్తున్నాయని నివేదిక ప్రశంసించింది. బెంగళూరు టాప్ స్థానంలో కొనసాగుతుండగా, హైదరాబాద్ నాలుగో స్థానంతో తన శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది.