|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 08:48 PM
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా తెల్ల కాగితాలపై భూముల క్రయవిక్రయాలు జరిపి, సమస్యల్లో ఉన్న రైతులకు పెద్ద ఉపశమనం లభించనుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరణి స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి వ్యవస్థ ద్వారా ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సాదాబైనామాల క్రమబద్ధీకరణ..
కొత్త రెవెన్యూ చట్టం, భూభారతి బిల్లులో చేసిన సవరణల ద్వారా.. సాదాబైనామాలను క్రమబద్ధీకరించేందుకు ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని సవరించారు. భూభారతి చట్టం సెక్షన్-6లోని సబ్-సెక్షన్-1 కింద, 2014 జూన్ 2కు ముందు తెల్ల కాగితాలపై భూమిని కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులు అర్హులు. అలాగే.. 2024 జూన్ 2 నాటికి ఆ భూమి తమ సాగులోనే ఉందని సాదాబైనామా పత్రం కలిగి ఉండాలి. రైతు కనీసం 12 సంవత్సరాలకు పైగా ఆ భూమిని తన అధీనంలో ఉంచుకున్నట్లు రుజువు చూపించిన దరఖాస్తులను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దాఖలైన దరఖాస్తులను ఇప్పుడు పరిశీలించనున్నారు. నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న రైతులందరికీ దీని ద్వారా న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ సుదీర్ఘకాలంగా నిలిచిపోవడం వల్ల రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు వంటి ప్రయోజనాలను కోల్పోయారు. ఈ ప్రస్తుత ప్రక్రియలో ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. భూమి విక్రయించిన పాత యజమాని తను భూమిని అమ్మానని, భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదనే అఫిడవిట్‌ను తప్పనిసరిగా రెవెన్యూ అధికారులకు సమర్పించాలనే నిబంధన.
చాలా మంది పాత యజమానులు భూమి రికార్డుల్లో ఇంకా తమ పేరు ఉండటం వల్ల అఫిడవిట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. విక్రయదారులు మరణించిన కేసుల్లో.. వారి కుటుంబ సభ్యులు అభ్యంతరాలు చెబుతున్నారు. 2016 తర్వాత జమాబందీ నిలిచిపోవడం వల్ల పహాణీల్లో కూడా సరైన వివరాలు లేకపోవడం సాదాబైనామాల క్రమబద్ధీకరణను సంక్లిష్టం చేస్తోంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా.. మొత్తం 28,314 దరఖాస్తులు రాగా.. 14,214 మంది రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నల్గొండ డివిజన్ నుంచి 10,160 దరఖాస్తులు రాగా.. 9,721 మందికి నోటీసులు జారీ చేశారు. మిర్యాలగూడ డివిజన్ నుంచి 13,186 దరఖాస్తులు రాగా.. 2,333 మందికి నోటీసులు జారీ చేశారు. దేవరకొండ డివిజన్ నుంచి 2,871 దరఖాస్తులు రాగా.. 969 మందికి నోటీసులు జారీ చేశారు. చండూరు డివిజన్ నుంచి 2,097 దరఖాస్తులు రాగా.. 1,191 నోటీసులు మందికి నోటీసులు జారీ చేశారు. ఎలాంటి సమస్య లేని వారి సాదాబైనామా దరఖాస్తు దారులకు త్వరలో పట్టాలు అందించనున్నారు.