|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 08:44 PM
విద్యా, ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ భాగ్యనగరం ఆశ్రయం ఇస్తుంది. అయితే.. ఈ మహానగరంలో అద్దె ఇళ్లలో నివసించే వారి భద్రత, గోప్యతపై తాజాగా జరిగిన ఒక ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. జవహర్ నగర్, మధురానగర్‌లో వెలుగు చూసిన ఈ విచిత్ర ఉదంతం.. ఇంటి యజమానుల తీరుపై ప్రజల్లో భయాన్ని పెంచింది.
బాత్రూంలో రహస్య కెమెరా ఏర్పాటు...
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్‌లోని ఒక ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగం చేసే ఒక దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఈ ఇంటికి యజమాని. ఈ నెల 4వ తేదీన ఆ ఇంట్లోని బాత్‌రూమ్ బల్బ్ పని చేయకపోవడంతో.. దంపతులు ఆ విషయాన్ని ఇంటి యజమానికి తెలిపారు. యజమాని ఒక ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి కొత్త బల్బ్‌ను అమర్చేందుకు వచ్చాడు. అయితే.. బల్బ్‌తో పాటు దాని హోల్డర్‌లో రహస్యంగా ఒక సీక్రెట్ కెమెరాను కూడా ఏర్పాటు చేయించారు. దీనితో.. ఆ ఇంట్లో నివసించే వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రయత్నం జరిగింది.
ఈ నెల 13న.. బాత్‌రూమ్‌లోని బల్బ్ హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో.. ఆ మహిళ తన భర్తకు చూడమని చెప్పింది. హోల్డర్‌ను విప్పి పరిశీలించిన భర్తకు అందులో దాచి ఉంచిన సీక్రెట్ కెమెరా కనిపించి షాక్‌కు గురయ్యారు. బాధిత దంపతులు వెంటనే ఈ విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి తీసుకువెళ్లారు. అయితే.. యజమాని వారి మాటలను పట్టించుకోకుండా, ఈ పని ఎలక్ట్రీషియన్ చేసి ఉంటాడని బుకాయించేందుకు ప్రయత్నించాడు. దీంతో.. ఆ జంట న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి. ఇంటి యజమాని అశోక్ యాదవ్ ఆదేశాల మేరకే ఎలక్ట్రీషియన్ చింటూ కెమెరాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
పోలీసులు వెంటనే ప్రధాన నిందితుడు అయిన ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇలాంటి అనుచిత సంఘటనలు సాధారణంగా హాస్టళ్లు, హోటళ్లలో వెలుగు చూసేవి. కానీ, ఇప్పుడు అద్దె గృహాల్లో కూడా వ్యక్తుల గోప్యతకు రక్షణ లేకుండా పోవడం నగరంలో నివసించే ప్రజల్లో భయాందోళనలను పెంచింది.
అయితే సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నా గుర్తించాలంటే.. ముందుగా ఆ గది తలుపులు మూసేసి.. లైట్లు అన్ని బంద్ చేయాలి. ఎక్కడా కూడా బయట నుంచి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ టార్చ్ లైట్ ద్వారా రూం మొత్తం వెతకండి.. ఎక్కడైతే సీసీ కెమెరా ఉంటుందో అక్కడ కెమెరా ఫ్లాష్ లైట్ బ్లింక్ అవుతుంది. ఇలా హిడెన్ కెమెరాలను గుర్తించవచ్చు.