|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 06:48 PM
ఒక అమాయక ఇంటర్ విద్యార్థిని జీవితాన్ని సొంత రక్త సంబంధీకుడే బలిగొన్న హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. నిత్యం రక్షణగా నిలబడాల్సిన వ్యక్తి కామాంధుడిలా మారాడు. అతడు చేసిన వేధింపులు తాళలేక ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
పెద్దనాన్న వేధింపులు..
ఈ అత్యంత దారుణమైన సంఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, కొంపల్లి పరిధిలోని పోచమ్మ గడ్డలో జరిగింది. అంజలి (17) అనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కుటుంబం నిజామాబాద్ జిల్లాలోని వర్ని ప్రాంతం నుంచి ఉపాధి కోసం కొంపల్లికి వలస వచ్చింది.
గత సంవత్సరం.. బాధితురాలి తండ్రి ఒక ప్రమాదంలో మరణించారు. అంతకుముందు, ఆయన తన అన్న (బాలికకు పెద్దనాన్న)తో కలిసి మేడ్చల్‌లో ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నారు. ఈ రుణ వ్యవహారాల కారణంగా బాలిక పెద్దనాన్న తరచుగా వారి ఇంటికి వస్తుండేవాడు. ఈ సందర్భాన్ని వాడుకుంటూ, అతను ఆ బాలికను అత్యాచార వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు.
సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ఆత్మహత్యకు ముందు అంజలి రాసిన సూసైడ్ నోట్‌లో అత్యంత సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి. "అమ్మా, నన్ను క్షమించు. నాకు బతకాలని లేదు. నాన్న చనిపోయాక పెద్దనాన్న ప్రతి వారం గొడవకు వస్తున్నాడు. నాకు అవమానంగా, కష్టంగా ఉంది. అతడు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు" అని పేర్కొంది. అంతేకాకుండా, "ఫైనాన్స్ ఇప్పించి తానే నాన్నను చంపాను" అని పెదనాన్న తనతో చెప్పినట్లు కూడా అంజలి ఆ లేఖలో పేర్కొంది. చివరిగా "పెదనాన్నకు కచ్చితంగా శిక్ష పడాలి. సారీ మమ్మీ. ఇట్లు నీ పింకీ" అని రాసి తన ఆవేదనను వ్యక్తం చేసింది.
పోలీసుల దర్యాప్తు..
తండ్రి మరణం తాలూకు దుఃఖం తీరకముందే, సొంత కుటుంబ సభ్యుడి వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఆ బాలిక తన జీవితాన్ని బలిపీఠం చేసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడైన పెద్దనాన్నపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో లైంగిక వేధింపులతో పాటు, బాలిక తండ్రి మరణం వెనుక ఉన్న నిజానిజాలను కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడే వ్యక్తులకు న్యాయస్థానం ద్వారా కఠిన శిక్షలు విధించాలని, అప్పుడే సమాజంలో మహిళలకు, బాలికలకు భద్రత లభిస్తుందని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.