|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 09:12 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. ఒకవైపు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగగా, మరోవైపు ఆటో, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు, ఇన్వెస్టర్లలో నెలకొన్న అనిశ్చితికి అద్దం పట్టాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 57.87 పాయింట్లు నష్టపోయి 82,102.10 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 32.85 పాయింట్లు తగ్గి 25,169.50 వద్ద ముగిసింది.రంగాల వారీగా పనితీరును పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలు కనిపించాయి. నిఫ్టీ ఐటీ సూచీ 0.71 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 1.29 శాతం మేర పతనమయ్యాయి. టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్ వంటి షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. అయితే, పండుగ సీజన్ డిమాండ్ అంచనాలతో ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీ ఆటో సూచీ 0.62 శాతం, నిఫ్టీ బ్యాంక్ 0.41 శాతం చొప్పున లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, ఎస్‌బీఐ, టాటా స్టీల్ షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి.