|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 04:11 PM
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోరుకు సిద్ధమైన మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రఘునాథపల్లి మండలంలో ఆయన చేపట్టాలనుకున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వివరాల్లోకి వెళితే, కడియం శ్రీహరికి వ్యతిరేకంగా రఘునాథపల్లిలో పాదయాత్ర చేసేందుకు రాజయ్య సిద్ధమవ్వగా, పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు ఉన్నందున, పాదయాత్రకు వెళ్లడం సరికాదని సూచించారు. అయినప్పటికీ, రాజయ్య వెనక్కి తగ్గకపోవడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఆయన్ను గృహ నిర్బంధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.