|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 07:02 PM
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వేలాది విద్యాసంస్థల మనుగడ ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండేళ్లుగా బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని, ఇది సిగ్గుచేటని ఆయన విమర్శించారు. హరీశ్ రావు స్పందిస్తూ... "ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు మూతపడే దుస్థితి నెలకొంది. సుమారు 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు సైతం వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. ఫీజు బకాయిల కోసం సోమవారం నుంచి విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు.