|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 04:28 PM
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే. 12 వరుసలతో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తున్నారు. ఈ హైవే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయానికి అప్పగించనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించిన DPRను సిద్ధం చేయాలని ఇటీవల కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు సమాచారం.
ఈ ఎక్స్‌ప్రెస్ హైవే మొత్తం పొడవు సుమారు 210-230 కిలోమీటర్లు ఉండవచ్చని NHAI అంచనా వేస్తోంది. ఈ హైవే హైదరాబాద్- విజయవాడ హైవేకు సమాంతరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే కిలోమీటర్‌కు సుమారు రూ.40 కోట్ల చొప్పున మెుత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్ ఆధారంగా అంచనా వేసిన అలైన్‌మెంట్‌పై పూర్తి స్థాయి సర్వే తర్వాత స్పష్టత వస్తుంది. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి ఈ రహదారిని నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
కేంద్రం నుంచి అనుమతులు రావడంతో ఎన్‌హెచ్ఎఏ త్వరలోనే DPR తయారీకి కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు బిడ్‌లను పిలవనుంది. ఎంపికైన కన్సల్టెన్సీ ఇచ్చే నివేదిక ఆధారంగానే NHAI తదుపరి టెండర్లకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రహదారి నిర్మాణం ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఒక భాగం కాగా.. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా చండూరు, మునుగోడు, సూర్యాపేట మీదుగా ఈ రహదారిని నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం సిద్ధం అయ్యాయి.