|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 04:25 PM
యూరియా బస్తాల కోసం సామాన్యు రైతు మాదిరిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహిళా నేత సత్యవతి రాథోడ్ క్యూలైన్‌లో నిల్చుని, తన వంతు వచ్చే వరకూ వేచిచూసి కూపన్ రాయించుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో గుండాతమడుగు సహకారం సంఘం వద్ద రైతులకు యూరియా పంపిణీ జరుగుతుండగా.. సత్యవతి రాథోడ్ అక్కడకు వచ్చారు. తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమి పట్టాదారు పాస్ పుస్తకంతో క్యూలైన్‌లో నిలబడ్డారు. మిగతా రైతులతో పాటు యూరియాకు కూపన్లు రాయించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ.... యూరియా కోసం అన్నదాతలు నిద్రాహారాలు లేకుండా పడిగాపులు కాస్తున్నారని, అయినా ఒక్క బస్తా కూడా అందడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కుంటిసాకులతో తప్పించుకోకుండా యూరియా అందించాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా యూరియా సక్రమంగా లభ్యం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేకపోవడంతో సహకార సంఘాల కేంద్రం వద్ద బారులు తీరిన దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యూరియా బస్తాల కోసం తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ రైతు.. గడ్డి మందు తాగి ఆత్మహత్యాత్నయం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తగూడెం మండల కేంద్రం బూర్క గూంపుకు చెందిన మల్లెల నరసయ్య యూరియా కోసం సరఫరా కేంద్రం చుట్టూ తిరిగి.. ఒక్క బస్తా కూడా దొరక్కపోవడంతో విసిగిపోయాడు. సహకార సంఘం వద్ద గడ్డిమందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. అతడ్ని అక్కడున్నవారు స్పందించి చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చించారు.
యూరియా కష్టాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగినంత ఎరువును సరఫరా చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సహకార సంఘాల ఎదుట ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. రెండు రోజుల కిందట నల్గొండ జిల్లా అద్దంకి- నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటువంటి పరిస్థితులే నెలకున్నాయి. క్యూలైన్‌లో నిల్చుని నీరసించి సొమ్మసిల్లి పడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.