|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 07:47 PM
నగరవాసులను కుదిపేసిన కూకట్‌పల్లి మైనర్ బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను హత్య చేసింది పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. మృతురాలి ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం కోసం వెళ్లిన నిందితుడు.. బాలిక తనను చూసి కేకలు వేయడంతో.. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత నేరం నుంచి తప్పించుకోవడానికి చాలా తెలివిగా వ్యవహరించి.. పోలీసులనే తప్పుదోవ పట్టించాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి మాట్లాడుతూ.. నిందితుడు క్రిమినల్ అని.. అతడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
తన కూతుర్ని చంపిన నిందితుడిని అదే చోట ఉరి తీయాలని.. లేదంటే పెట్రోల్ పోసి తగలెట్టాలంటూ మృతురాలు సహస్ర తండ్రి కృష్ణ డిమాండ్ చేస్తున్నారు. తాము ఉండేది చిన్న బస్తీ అనీ.. తమ కొడుకు అందరితో తిరుగుతాడు అని తెలిపారు. అలాగే నిందితుడు తమ పాప పుట్టినరోజుకి కూడా వచ్చాడని వివరించారు. నిందితుడిది క్రిమినల్ మైండ్ అని అలాంటి వాడు భూమి మీద ఉండకూడదు అని.. వెంటనే అతడిని చంపేయాలని డిమాండ్ చేశారు. తన బిడ్డను దారుణంగా హత్య చేసిన వాడికి బతికే హక్కు లేదన్నారు. అలాంటి క్రిమినల్స్‌ను వదిలేస్తే.. తమలాంటి మరేందరో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీడియా, పోలీసులు, చట్టం, ప్రభుత్వం నిందితుడిని మైనర్ అని, బాలుడని అంటున్నారు.. కానీ అతడు పెద్ద సైకో అని.. అలాంటి వాడిని మైనర్‌గా పరిగణించొద్దని సహస్ర తండ్రి విజ్ఞప్తి చేశారు. తన బిడ్డను దారుణంగా హత్య చేసిన తర్వాత తమ మధ్యే తిరిగాడని.. తన కొడుకును ఏడవకని ఓదార్చడని చెప్పుకొచ్చారు. పైగా నా బిడ్డ డాడీ.. డాడీ అని కేకలేసిందని తనతో చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అలానే నిందితుడి తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణంలో వారి ప్రమేయం కూడా ఉందని బాలిక తండ్రి ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. దీనికన్నా ముందు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరిచారు. శనివారం నాడు సీపీ కేసు వివరాలను వెల్లడించారు. కూకట్‌పల్లి దయార్‌గూడలో నివాసం ఉంటున్న సహస్ర అనే బాలికను నిందితుడు ఐదు రోజుల క్రితం అనగా ఆగస్టు 18న దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.