|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 01:53 PM
జోగులాంబ గద్వాల జిల్లా ప్రకృతి విపత్తులకు గురయ్యే అవకాశాలు ఉండటంతో, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బియం. సంతోష సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో విపత్తు నిర్వహణ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. విభిన్న శాఖల అధికారులు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల వర్షాకాలంలో వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందన కోసం అన్ని శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవస్థలను సిద్ధంగా ఉంచి, అవసరమైన సిబ్బంది, వాహనాలు, పరికరాలను ప్రీ-పోజిషన్ చేయాలని సూచించారు. ప్రజలలో అవగాహన పెంపొందించేలా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.