|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 08:50 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలకు అల్పపీడనం విస్తరించడంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ అల్పపీడనం మరింత బలపడటంతో తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి మరో మూడు రోజుల వరకు తూర్పు తెలంగాణ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. నేడు పలు జిల్లాల్లో ముసురుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల, నిజామాబాద్, నారాయణపేట్, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో సాధారణ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు సోమవారం (జూన్ 30) సాయంత్రం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్దయింది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా ఈ వర్షాలు రైతులకు ఆనందాన్ని కలిగిస్తుండగా.. హైదరాబాద్ నగర ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు.