![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 05:47 PM
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చొరవ చూపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలేను కోరారు. శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అథవాలే, కవిత ఆహ్వానం మేరకు ఆమె నివాసానికి వెళ్లారు. కవిత నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లు చాలాకాలంగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని ఆమె కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.స్థానిక సంస్థల్లో బీసీలకు వారి జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పించడం అత్యవసరమని ఆమె అన్నారు. తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది న్యాయమైన డిమాండ్ అని, దీనికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. సమాజ నిర్మాణంలో బహుజనుల పాత్ర కీలకమైనప్పటికీ, స్థానిక సంస్థల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆమె పేర్కొన్నారు.