![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 07:11 PM
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోని కొన్ని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలపై దాడులు చేశారు. అకస్మాత్తుగా ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ఆర్టీఏ కార్యాలయాల తలుపులు మూసివేసి మరి అధికారులు దాడులు చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఏం జరుగుతుందో తెలియక కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆందోళన చెందారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల గేట్లు మూసివేసి సోదాలు చేపట్టారు. తనిఖీల నేపథ్యంలో అధికారులు అందరిని బయటకు పంపించారు. ఆర్టీఏ అధికారులు, ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వ్యక్తమవడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆర్టీఏలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. పెద్దపల్లిలో.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం (ఆర్టీఓ)లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. గురువారం కరీంనగర్ ఏసీబీ (ఏసీబీ) డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు పెద్దపల్లిలోని జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి, వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలను అదుపులోకి తీసుకొని సోదాలు చేస్తున్నారు. బయటి వారిని లోనికి, లోపల ఉన్న వారిని బయటకు వెళ్లకుండా తాళాలు వేసి సోదాలు చేపడుతున్నారు. పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంపై.. తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కొంతకాలంగా ఏజెంట్ల ఆగడాలు శృతిమించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సుమోటోగా తీసుకొని సోదాలు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 18 మంది ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వారి సెల్ ఫోన్లు, ఇతరత్రా సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఏజెంట్లు కార్యాలయంలో అక్రమంగా వాహనాల లైసెన్సుల జారీ విషయంలో కమీషన్లు తీసుకుంటూ అక్రమ దందాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.